కరీంనగర్ జిల్లా: అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న వ్యక్తిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి, భారీ మొత్తంలో పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న పేలుడు పదార్థాలను గుర్తించి, రామడుగు మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన వేముల భూమయ్య (45)ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సామగ్రిలో 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3,000 మీటర్ల డిటోనేటింగ్ వైర్తో కూడిన మూడు బండిళ్లు, రెండు కంప్రెసర్ ట్రాక్టర్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల నంబర్లు TS 02 UC 2690, TG 02 T 0082గా పోలీసులు గుర్తించారు. అనంతరం పేలుడు పదార్థాలు, కంప్రెసర్ ట్రాక్టర్లను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సైదాపూర్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.









