గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణానికి ఎట్టకేలకు నిధులు మంజూరయ్యాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ.11 కోట్లు కేటాయించింది. దసరా పండుగ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉండటంతో స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్కు బిల్లులు పెండింగ్లో పడటంతో రహదారి నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారి పనులను పూర్తి చేయాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాలు, అఖిలపక్ష నేతలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు సైతం చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అసెంబ్లీలో సమస్యను లేవనెత్తిన ఎమ్మెల్యే
గుండ్లపల్లి–పొత్తూరు రహదారి సమస్యను మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ దృష్టికి తీసుకెళ్లారు. రహదారి అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పెండింగ్ బిల్లులతో పాటు మిగిలిన నిర్మాణ పనుల కోసం నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సప్లిమెంటరీ నోట్ విడుదల చేసి, రహదారి పనుల కోసం రూ.11 కోట్లు మంజూరు చేసినట్లు తెలిసింది. దీంతో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. దసరా తర్వాత నిర్మాణ పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
ప్రజలకు తీరనున్న రవాణా కష్టాలు
గుండ్లపల్లి–పొత్తూరు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. వాహనదారుల ఇబ్బందులు తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అయ్యే అవకాశం ఉంది. రహదారి అభివృద్ధితో స్థానిక ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రహదారి పనులకు నిధులు మంజూరు కావడంతో గన్నేరువరం మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ప్రయత్నాలతో సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటంపై స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది.








