గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు గన్నేరువరంలో ఘనంగా జరిగాయి. గన్నేరువరం స్వగ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్సై బుర్ర ఎల్లయ్య గౌడ్ నివాసంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రతి ఏడాది ఆనవాయితీగా ఈసారి కూడా ఎల్లయ్య గౌడ్ కుటుంబ సభ్యులు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మను పేర్చి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఎల్లయ్య గౌడ్ సతీమణి సంధ్యారాణి, కుమారుడు సాయి రోహన్ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఇంటి నుంచి బతుకమ్మను తీసుకెళ్లి, మహిళలతో కలిసి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా బతుకమ్మ నిమజ్జనం నిర్వహించారు.

ఈ వేడుకలకు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను బుర్ర ఎల్లయ్య గౌడ్ కుటుంబ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతను, పూల పండుగ విశిష్టతను చాటిచెబుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, బంధుమిత్రులు తదితరులు పాల్గొని బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.









