- భువనగిరి ఘటన పై స్పీకర్ కు,
- కరీంనగర్ సీపీపై సీఎం కు ఫిర్యాదు
- మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లా భువనగిరిలో దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం (నకిరేకల్)కు పోలీసుల వల్ల జరిగిన ఘోర అవమానంపై స్పీకర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు దళిత సామాజికవర్గానికి చెందిన మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు భువనగిరికి వచ్చే రాష్ట్ర మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభృతులకు ఆహ్వానం పలికేందుకు హెలికాప్టర్ వద్దకి వెళుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం ను అడ్డుకోవడమే కాకుండా ఛాతిపై చేయి వేసి తోసివేసి ఘోరంగా అవమానించారని ఆయన ఆరోపించారు. ఇది ప్రభుత్వపరంగా జరిగిన తప్పిదం ఎంతమాత్రం కాదని, ఎస్సీలపట్ల పోలీస్ అధికారులకు ఉన్న చిన్నచూపు, చులకనభానం,దురహంకారమే కారణమని ఆయన పేర్కొన్నారు. దురహంకార పోకడలు గల పోలీసు అధికారులు అక్కడక్కడ ఉన్నారని, కరీంనగర్ పోలీస్ బాస్ కూడా ఇదే తరహా పోకడలను అనుసరిస్తున్నారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. మానకొండూర్ సీఐ పోస్టు ఖాళీగా ఉండటంతో అక్కడ సీఐని ముఖ్యమంత్రి సహకారం తో నియమిస్తే దాన్ని కరీంనగర్ సీపీ రద్దు పర్చారని, త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించకుండా సీఐకు పోస్టింగ్ ఇవ్వడం కుదరదని మెలిక పెట్టగా, సీపీ సూచన మేరకు బోర్డ్ మీటింగ్ నిర్వహించి సీఐ పోస్టింగ్ ఇచ్చారని ఆయన తెలిపారు. అయితే నేను కాదన్నా ఎలా పోస్టింగ్ తెచ్చుకున్నావంటూ సదరు సీఐని బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ధళిత ఎమ్మెల్యే ఇంకో దళిత అధికారికి సీఐ పోస్టింగ్ వేయిస్తారా? అనే చిన్నచూపు, దురహంకారంతోమే సీపీ అభ్యంతరానికి కారణమని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ సీపీ నిర్వాకాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి తేనున్నటు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ తెలిపారు.