కేరళలోని కొచ్చి నగరాన్ని పేలుళ్లు వణికించాయి. సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. ఈ ప్రార్థనలలో పాల్గొనేందుకు దాదాపు 2 వేలకు పైగా వచ్చారని, పేలుడు జరిగిన తర్వాత అక్కడంతా భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కన్వెన్షన్ సెంటర్ లో బాంబు పేలుళ్లు చోటుచేసుకోవడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఫైర్, వైద్య సిబ్బందితో అక్కడికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. పేలుడు తర్వాత భారీగా పొగ అలుముకోవడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని, అక్కడంతా గందరగోళం నెలకొందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వివరించారు.