హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు యంగ్ హీరో నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చకూడదంటే సమంతను పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశారని ఆమె చెప్పారు. దీంతో, కేటీఆర్ వద్దకు వెళ్లాలని సమంతపై నాగార్జున, ఆమె భర్త నాగచైతన్య ఒత్తిడి చేశారని తెలిపారు. అయితే, దీనికి సమంత ఒప్పుకోలేదని చెప్పారు.
దీంతో, కేటీఆర్ వద్దకు వెళ్లకపోతే… తమ ఇంటి నుంచి వెళ్లిపోవాలని సమంతకు నాగార్జున స్పష్టం చేశారని… ఈ కారణంతోనే, ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత నాగచైతన్యతో సమంత విడిపోయిందని చెప్పారు. మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను కూడా కేటీఆర్ టార్చర్ పెట్టారని… కేటీఆర్ వల్లే రకుల్ తక్కువ సమయంలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోయి, హడావుడిగా పెళ్లి చేసుకుందని అన్నారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. టాలీవుడ్ ను షాక్ కు గురి చేస్తున్నాయి.
మరోవైపు, కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను నాగార్జున ఖండించారు. ఎక్స్ వేదికగా నాగార్జున స్పందిస్తూ…”గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను… మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను” అని ట్వీట్ చేశారు.