జగిత్యాల జిల్లా / కోరుట్ల : తెలంగాణ ప్రభుత్వం రైతు రుణ మాఫీ చేశామని ఘనంగా చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదని ఆందోళనకు దిగుతున్నారు. రుణ మాఫీకి రూ.31 కోట్లు అవసరం అవుతాయని లెక్కగట్టిన ప్రభుత్వం రూ.17 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. దీనిపై వారు ఏ అధికారిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రుణ మాఫీ చేస్తారని కాంగ్రెస్ కు ఓటు వేస్తే నట్టేట ముంచారని అన్నదాతలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల లో రైతులు ఆందోళన చేపట్టారు. తమకు రుణ మాఫీ కాలేదని చెబుతున్నారు. ఏఈఓను కలిసినా.. ఏఓను కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని వివరాలు సరిగా ఉన్నా.. రుణ మాఫీ కాలేదని చాలా మంది రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ముద్దగా స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఆందోళనలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.