హైదరాబాద్ : కేసీఆర్ మీద అధికార దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ప్రతిష్ఠాత్మక తీర్పును ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని వ్యాఖ్యానించారు. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని సుప్రీంకోర్టు తాజా నిర్ణయం స్పష్టం చేసిందన్నారు. విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను వేసింది. దీనిని రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే కమిషన్‌ను మార్చాలని సర్వోన్నత న్యాయస్థానం నిన్న ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై కేటీఆర్ స్పందించారు. త్వరలో ప్రజాక్షేత్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాంటి తీర్పే రాబోతుందన్నారు. కాంగ్రెస్ చేస్తోన్న దుష్ప్రచారాలకు ఆ దేవుడు కూడా తగిన శిక్ష విధిస్తాడన్నారు. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందన్నారు. దురుద్దేశపూరిత ప్రచారానికి గాను కాంగ్రెస్ పార్టీని సర్వశక్తిమంతమైన న్యాయస్థానం కూడా శిక్షిస్తుందన్నారు.