హైదరాబాద్ : కొడంగల్ రైతులు జైల్లో ఉన్న ఈ సమయంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఏం చేస్తున్నారో చూడండంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఫార్మా సిటీ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యపు భూసేకరణను నిరసిస్తూ 16 మంది రైతులు జైల్లో ఉన్నారని, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేస్తున్న పని చూడండంటూ ఎక్స్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ బస్సులో పౌరాణిక పాత్రలను ఇమిటేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
మరోవైపు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు లండన్‌లో ఉన్నారని, కానీ రైతులు మాత్రం జైల్లో ఉన్నారని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరు నెలలుగా పోరాటం
ఫార్మా విలేజ్‌ను నిరసిస్తూ ఆరు నెలలుగా కొడంగల్ నియోజకవర్గంలో రైతులు ఉద్యమిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రజల తిరుగుబాటులో ఎవరి కుట్రా లేదన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముచ్చర్లలో ఫార్మా సిటీ రద్దు అని సీఎం చెప్పగానే భూములు ఇచ్చిన రైతులు సంతోషపడ్డారన్నారు. తమ భూములు తమకు ఇస్తారని రైతులు సంతోషపడ్డారన్నారు. కానీ నెల రోజుల్లోనే ఫార్మా సిటీ రద్దు అటుంచి… ఫార్మా విలేజ్ పెడతామని చెప్పడంతో వారు ఆందోళలు చేస్తున్నారని తెలిపారు.
కేసీఆర్ ఆనవాళ్లు ఉండకూడదన్న ఉద్దేశంతో ఫార్మా సిటీ పేరును ఫార్మా విలేజ్‌గా మార్చారని ఆరోపించారు. ఫార్మా రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ ఫార్మా యూనివర్సిటీ తేవాలని తాము 14 వేల ఎకరాలు సేకరించామని తెలిపారు. ఏమీ తెలియకుండానే తాము ఇదంతా చేయలేదన్నారు. తెలంగాణను ఫార్మా రంగంలో లీడర్ చేయాలని భావించామని… ఫార్మా సిటీని అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు విదేశాల్లో కూడా పర్యటించినట్లు చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఫార్మా సిటీ పూర్తి చేద్దామని తాము భావించామని, అలాగే భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేశామన్నారు. అలాంటి ఫార్మా సిటీని వదిలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తుగ్లక్, మూర్ఖ నిర్ణయాలతో అందరినీ ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అందుకే ప్రజలు తిరగబడుతున్నారని తెలిపారు.