నిజామాబాద్ నుంచి పొరపాటున షబ్బీర్ అలీని గెలిపిస్తే ఆ తర్వాత ఆయన ఇక్కడ మళ్లీ కనిపించడని మంత్రి కేటీఆర్ అన్నారు. తమకు ఒక్క అవకాశమివ్వమని కాంగ్రెస్ అంటోందని, కానీ 11సార్లు అవకాశమిచ్చినా చేసిందేమీ లేదన్నారు. పైగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి ప్రయోజనమవుతుందని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ జిల్లా ఖిల్లా రోడ్డులో నిర్వహించిన రోడ్డు షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… బీఆర్ఎస్ చరిత్రలో బీజేపీతో జత కట్టలేదని… భవిష్యత్తులోనూ జత కట్టదని స్పష్టం చేశారు. కేసీఆర్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అయినా కాంగ్రెస్, బీజేపీలకు భయపడేది లేదన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి మీ కళ్ళ ముందే ఉందని, దానిని చూసి ఓటేయాలని కోరారు.
అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేసిన అభివృద్ధికి తానే సాక్ష్యమన్నారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌కు దీటుగా నిజామాబాద్‌లో ట్యాంక్‌బండ్ ఏర్పాటు చేశామని, నగరంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్ గ్రౌండ్ పనులు పూర్తి చేశామన్నారు. కరోనా సమయంలో ప్రజల కష్టాలను చూసి సొంత డబ్బుతో గణేష్ గుప్తా సేవలు అందించారని గుర్తు చేశారు. తెలంగాణలో పదేళ్లలో ఒక్క మత ఘర్షణ లేదన్నారు. కాంగ్రెస్ మతపరంగా ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తోందన్నారు. కామారెడ్డిలో పని చేయలేని షబ్బీర్ అలీ నిజామాబాద్‌లో ఏం పని చేస్తాడు? అని ప్రశ్నించారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అన్నారు. మైనార్టీ సంక్షేమం కోసం పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.