తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ స్పష్టం చేశాడు. కేటీఆర్‌కు తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని వెల్లడించాడు. ఈ విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయని, దర్యాప్తునకు సిద్ధమని వెల్లడించాడు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ పంపించిన లీగల్ నోటీసుకు సుఖేష్ చంద్రశేఖర్ సమధానం ఇచ్చాడు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలంటూ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఒత్తిడి తెస్తున్నారంటూ సుఖేష్ తెలంగాణ గవర్నర్‌కు లేఖ రాశాడు. దీంతో కేటీఆర్ తన న్యాయవాది ద్వారా సుఖేష్‌కు లీగల్ నోటీసు పంపారు. తనపై తప్పుడు వివరాలతో గవర్నర్, కేంద్ర హోంమంత్రి, సీబీఐకి లేఖల ద్వారా సుఖేష్ ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పి ఫిర్యాదును వెనక్కుతీసుకోకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.