ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కొద్ది సేపటి క్రితం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు కలిశారు. కూటమి నేతగా చంద్రబాబును ఎన్నుకున్న లేఖను వారు గవర్నర్ కు అందించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని గవర్నర్ ను నేతలు కోరారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు ఉన్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిచనున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే అంశంపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఆ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు ఉదయం కూటమి ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ భేటీలో కూటమి శాసనసభా పక్ష నేతగా చంద్రబాబును ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈభేటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తదితరులు హాజరయ్యారు.