- అఖిలభారత మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు కె.వి చౌదరి పిలుపు
- దేశంలో నిరుద్యోగం, దారిద్రానికి పాలకుల నిర్ణయాలే కారణం
- జేఎన్ యు రిటైర్డ్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్
తిరుపతి :ప్రస్తుత దేశ పరిస్థితుల్లో కేంద్ర కార్మిక సంస్థగా ఐ ఎఫ్ టి యు మీద ఎంత గురితర బాధ్యత ఉందని, ఈ మహాసభల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రజల సమస్యలపై కూడా చర్చించి వాటి పరిష్కారానికి సరైన నిర్ణయాలు తీసుకుని కార్మికు ఉద్యమాన్ని దేశంలో ఉరకలెక్కించి పురోగమించాలని ఐఎఫ్టియు ఏడవ అఖిలభారత మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు కేవీ చౌదరి పిలుపునిచ్చారు. ఇఫ్టూ అఖిలభారత మహాసభల్లో రెండవ రోజు సోమవారం తిరుచానూరు రోడ్డులోని ఎస్ ఎస్ బి కళ్యాణ మండపం, ఎస్ ఎన్ సింగ్ నగర్ లో ఐఎఫ్టియు ప్రతినిధుల సభ జరిగింది. ముందుగా ఇఫ్టూ జాతీయ అధ్యక్షురాలు అపర్ణ కార్మికుల జెండాను ఎగురవేసి అమరవీరులకు అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె అధ్యక్షతన జరిగిన సభలో కె.వి చౌదరి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మంది ప్రతినిధులు ఈమహాసభలకు తిరుపతికి రావడం ఆనందంగా ఉందని, ఈ మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఒకప్పటి చిత్తూరు జిల్లాకు కమ్యూనిస్టు ఉద్యమంలో ఎంతో గణనీయమైన పాత్ర ఉందని వివరించారు. బ్రిటిష్ ప్రభుత్వ నిషేధాలను లెక్కచేయకుండా కమ్యూనిస్టు అగ్రనేతలు పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, తరిమెల నాగిరెడ్డి వంటి నేతలు అజ్ఞాత జీవితాన్ని ఈ జిల్లాలోని గడిపారన్నారు. 1950- 60 ల మధ్య ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులను ఈ జిల్లా ప్రజలు గెలిపించారన్నారు. పీలేరు నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా గెలిచిన అమరజీవి సి కె నారాయణ రెడ్డి కుటుంబీకుడైన జార్జిరెడ్డి విద్యార్థి విప్లవ ఉద్యమ చరిత్రలో వేగుచుక్కగా నిలవడం చిత్తూరు జిల్లాకి గర్వకారణం అని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టి చట్టం వల్ల జిల్లాలోని చిన్న తరహా పరిశ్రమలు, సాంప్రదాయ, వ్యాపార, వర్తక, వాణిజ్య రంగాలు దెబ్బతింటే, పారిశ్రామిక ప్రాంతాలు విలవిల్లాడాయని అన్నారు, వర్తక రంగంలోకి విదేశీ, స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థల ప్రవేశానికి అవకాశం ఇవ్వడంతో లక్షలాదిమంది చిల్లర, చిన్న వర్తక వ్యాపారులు, ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునే జీవించేవారు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అంతేకాకుండా చిత్తూరు జిల్లాలో అత్యంత విలువైన, అరుదైన ఎర్రచందనం నాణ్యమైన కలపకు ప్రసిద్ధి చెందిందని అడవి బిడ్డలని నేరస్తులుగా ఇరికించి సమాజంలో ఘరానా పెద్దమనుషులుగా చెలామణి అవుతున్న వారు స్మగ్లింగ్ చేస్తూ వేల కోట్లు గడిస్తున్నారు. వేరుశనగ, టొమాటో, మామిడి, చెరకు పంటలకు, పాడి పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన చిత్తూరు జిల్లా ప్రస్తుతం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వ ఆదరణ కొరవడి లక్షలాది మంది రైతాంగం బలైపోతున్నారని అన్నారు. గిట్టుబాటు ధరల కోసం రైతులు అల్లాడుతున్నారని చెప్పారు. కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు స్వగ్రామాలకు చేరుకునేందుకు కాలినడకన రోడ్డు ఎక్కిన సమయంలో వారికి ఇఫ్టూ నేతలు అండగా నిలిచి అవసరమైన వసతి, ఆహారాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వంతో పోరాడి మరి వారికి రక్షణ కల్పించారని కేవీ చౌదరి చెప్పారు. ఇక ఏడుకొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి, బీబీ నాంచార్లను వివాహం చేసుకొని లౌకికవాద దేవుడిగా అందరి మన్ననలను, పూజలను అందుకుంటున్నాడని తెలియజేశారు. ఈ జాతీయ మహాసభలతో కార్మికోద్యమాలు మరింత పెరగాలని, కార్మిక సమస్యలు పరిష్కారానికి అవకాశం కలగాలని, ఆ దిశగా చర్చలు జరపాలని సూచించారు. అనంతరం న్యూఢిల్లీ జెఎన్యూ రిటైర్డ్ ప్రొఫెసర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో నెలకొని ఉన్న పరిస్థితులను తెలియజేశారు. నిరుద్యోగం, దారిద్రం వాటెంతటావే పెరగలేదని పాలకుల అనుసరిస్తున్న విధానాల వల్లే నేడు అవి పెరుగుతున్నాయని చెప్పారు. ఆదాని, అంబానీ లాంటి వారు వేల కోట్ల ఆస్తులను సంపాదించి ప్రపంచ కుబేరుల స్థానంలో ఉన్నారన్నారు. దేశంలో పేదలు మరింత నిరుపేదలుగా మారుతుంటే మరోవైపు కోటీశ్వరులు వేలకోట్ల అధిపతి అవుతున్నారన్నారు. ఈ తేడాను గుర్తించి పరిష్కరించడం నేడు తక్షణ కర్తవ్యంగా ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల, పరిశ్రమల ప్రైవేటీకరణ ఆందోళన కలిగిస్తోందని అన్నారు. చదువుకుంటున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం లేదని, ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేదని, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం కళ్ళ ముందు కనిపిస్తున్న నగ్న సత్యం అన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో జరుగుతున్న జాతీయ మహాసభలు మరింత చైతన్యవంతంగా, ఫలదాయకం కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ అఖిలభారత అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు పి. వెంకటరత్నం, అధ్యక్షులు వెంకయ్య, న్యూఢిల్లీ ఎన్ టి యు ఐ నేత గౌతమ్ మోడీ, తమిళనాడు టి యు సి ఐనేత జీవకుమార్, ఎన్ డి ఎల్ ఎఫ్ నేత వి.కన్నన్, ఎం. కె. కె. శరవణన్, బెంగాల్ కు చెందినఎస్ డబ్ల్యూ. సి.సి. నేత అమితాబ్, ఏపీకి చెందిన ఏఐఎఫ్ టియునాయకుడు గుర్రం విజయ్ కుమార్,పిడిఎస్యు ప్రధాన కార్యదర్శి భాస్కర్, పిఓడబ్ల్యూ ఝాన్సీ,అరుణోదయకళాకారుల సంఘం ఎస్.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు ఎస్. ఎన్. సింగ్ నగర్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఇఫ్టూ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ప్రదీప్ ప్రారంభించారు.