- భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది..
- తమ స్వార్ధప్రయోజనాల కోసం కొన్ని ప్రమాదకర పద్ధతులను కేంద్ర ప్రభుత్వం పాటిస్తోంది..
ఉన్మాద మనస్తత్వం కలిగిన ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నాం అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు.. విజయవాడలో మీట్ ద ప్రెస్‌లో మాట్లాడిన ఆయన.. భారతదేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. భారతదేశానికి లక్షల కోట్ల అప్పు పెరుగుతుంటే.. అదానీకి మాత్రం ఆస్తులు పెరుగుతున్నాయని మండిపడ్డారు.. మనం కట్టే ప్రతీ కరెంట్ బిల్లులో అదానీకి వాటా వెళ్తుందని.. అదానీ నుంచి ప్రధాని మోడీకి వాటా వెళ్తుందని సంచలన ఆరోపణలు చేశారు కేవీపీ.. ఇక, రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టడంతో మోడీ ప్రభుత్వం తలక్రిందులైందన్న ఆయన.. అదానీని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద పరిగణిస్తున్నారు. ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కిందకి వస్తుందా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యులు,151 మంది ఎమ్మెల్యేలున్నారు.. ఏ ఒక్క ఎంపీ అయినా రాహుల్ గాంధీ అనర్హత వేటు పై ప్రశ్నించారా..? అని నిలదీశారు కేవీపీ.. ఇలాంటి నేతలను మనం ఎన్నుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ రామచంద్రరావు.