కడప జిల్లాలో వందల కోట్ల రూపాయల విలువైన 34 ఎకరాల 83 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు..
అమరావతి: కడప జిల్లాలో వందల కోట్ల రూపాయల విలువైన 34 ఎకరాల 83 సెంట్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ కడప జిల్లా చిమ్మినిపేటకు చెందిన మార్కాపురం మురళీకృష్ణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, డిబిబిఎస్ సోమయాజుల ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ స్థలాన్ని రాజకీయ నాయకుల ప్రోత్బలంతో ఆక్రమించి భవనాలు నిర్మిస్తున్నారంటూ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చెరువులు ఆక్రమించడం చట్టరీత్యా నేరమని శ్రవణ్ కుమార్ ధర్మాసనానికి నివేదించారు. ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ తక్షణమే ఆక్రమణల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ధర్మాసనం ఆదేశించింది. రెండు నెలల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆక్రమణలు ఉంటే వాటిని తొలగించి భూములు స్వాధీనం చేసుకోవాలని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ విచారణ ముగించింది.