మర్రిపాడు మండలంలోని నాగినేణిగుంట ప్రాంతంలో అక్రమ భూ సాగు దారుల దాడి కలకలం రేపింది. స్థానిక రెవెన్యూ వీఆర్ఏ లక్ష్మమ్మ, తన పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకు భూ అక్రమదారుల అవినీతిని అడ్డుకునేందుకు విధులకు వెళ్లినప్పుడు, కొందరు వ్యక్తులు ఆమెపై దాడికి యత్నించారని సమాచారం. ఈ సంఘటన తరువాత ఆమె పోలీసులను ఆశ్రయించి ప్రాణ రక్షణ కోసం సహాయం కోరింది.
వివరాల్లోకి వెళ్తే, నాగినేణిగుంటలోని 288-1 సర్వే నెంబర్ కింద ఉన్న ప్రభుత్వ పొలంలో రైతులకి అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న నేపథ్యంలో, ఈ పొలంలో ఎవరు సాగులోకి వెళ్లకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేయబడినాయి. అయితే, కాలేపల్లి లక్ష్మీప్రసాద్, కాలేపల్లి రఘురాం, మరియు కారేపల్లి రాజారాం అనే వ్యక్తులు గడచిన కొన్ని రోజుల నుండి ఆ పొలంలో అక్రమ సాగు చేస్తున్నారు.
ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారులు తెలుసుకున్న తరువాత, వీఆర్ఏ లక్ష్మమ్మను సంఘటన స్థలానికి పంపించారు. ఆమె అక్కడకి వెళ్లి, సాగులోకి ఎవ్వరూ వెళ్లవద్దని ఆదేశించారు. కానీ, ఆదేశాలను అమలుచేస్తున్నప్పుడు, లక్ష్మమ్మపై అక్రమ సాగు దారులు అడ్డుకొని దాడికి యత్నించారని తెలిసింది.
భయపడిన లక్ష్మమ్మ అక్కడి నుంచి తప్పించుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్లో వెళ్లి తమకు ప్రాణ రక్షణ కల్పించమని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడికి ప్రయత్నించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆమె విధులకు అడ్డంకిగా మారిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరింది.
ఈ సంఘటనకు సంబంధించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ భూ సాగు దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రెవెన్యూ అధికారులు కూడా నిర్ణయించారు.