- రెవెన్యూ అధికారుల ప్రోత్సాహంతోనే నిర్మాణాలు సాగుతున్నాయని:
గిరిజన సంఘం నాయకులు విమర్శలు
అల్లూరి జిల్లా హుకుంపేట: 1/70 చట్టాన్ని రెవిన్యూ అధికారులు తూట్లు పొడుస్తున్నారని ఆదివాసి గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కిల్లో రామారావు, కృష్ణారావు మీడియా సమావేశంలో అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలు రెవిన్యూ శాఖ అధికారులు తుంగలో తొక్కుతున్నారని వారు విమర్శించారు. హుకుంపేట మండలంలో అయితే నిర్మాణ దశలో ఉన్న అక్రమ నిర్మాణాలకు రెవిన్యూ శాఖకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, మండల కేంద్రంలో జరుగుతున్న ఆక్రమ నిర్మాణాలు రెవెన్యూ శాఖ కనుసైగల్లో జరుగుతున్నాయన్నారు. రెండు నెలల వ్యవధిలోనే బుడ్డెకు కొండమ్మ, దొడ్డి ప్రసాదు, ఆలీ అనే గిరిజనేతరులు శాశ్వత నిర్మాణాలు చేబడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదనరు. కాసులకు కక్కుర్తి పడి గిరిజన చట్టాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు పై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేని యడల చట్టాల అమలుకు ఉక్కు పాదం మోపడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.