భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని వద్దిపేట, పూసుగుప్ప గ్రామాల ప్రధాన రహదారిలో పదిహేను కేజీల ల్యాండ్ మైన్ వెలికితీసిన బాంబు స్క్వాడ్ సిబ్బంది. సాధారణ తనిఖీల్లో భాగంగా చర్ల మండల పోలీసు సిబ్బంది వద్దిపేట, పూసుగుప్ప రహదారిలలో తనిఖీలు చేస్తుండగా, రహదారిపై ల్యాండ్ మైన్ గుర్తించినట్టు సిఐ అశోక్ తెలిపారు. తన సిబ్బందిని అప్రమత్తం చేసిన చర్ల మండల సిఐ అశోక్, బాంబు స్క్వాడ్ సమాచారాన్ని అందించి వారి సహాయంతో రోడ్డుకు ఇరువైపులా వివిధ ప్రదేశాల్లో భూమిలో అమర్చిన పదిహేను కేజీల ల్యాండ్ మైన్ వెలికి తీసి, బాంబు స్క్వాడ్ సహాయంతో నిర్వీర్యం చేశారు. కూబింగ్ చేస్తున్న పోలీసులను హతమార్చాలని ఉద్దేశంతోనే రహదారులకు ఇరువైపులా మావోయిస్టులు ల్యాండ్ మైండ్ లను అమర్చినట్లు తెలుస్తుండగా, బాంబును గుర్తించడం ద్వారా పెను ప్రమాదం తప్పిందని అశోక్ తెలిపారు. అనంతరం పరిసర ప్రాంతాలలో ఎక్కడైనా మందు పాత్రలు ఉన్నాయేమోనని మండల పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గ్రామంల్లోని రహదారికి ఇరువైపులా మందు పాత్రలను వెలికి తీసిన నేపథ్యంలో వ్యవసాయ పనులకు వెళ్లడానికి గిరిజన రైతులు, రైతు కూలీలు, పశువులను మేతకు తోలుకు వెళ్లడానికి పశువుల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టు అమర్చిన మందు పాత్ర పేలి పశువులు గాయపడిన సంఘటనలు కూడా ఉండగా, అనతికాలంలోనే వరస సంఘటనల నేపథ్యంలో గిరిజన ప్రజలు రోడ్డు మీదకు రావాలంటే తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వెళ్ళవలసి వస్తుంది.
