సిద్దిపేట జిల్లా :బెజ్జంకి మండల తహశీల్దారు కు సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రైతుల రుణాలు మాఫీ చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ 2018-19 నుండి 2023-24 వరకు బడ్జెట్లలోగానీ, రివైజ్డ్ చేసిన బడ్జెట్లతో సహా రూ.16,261 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రభుత్వం చెప్పిన 5వ విడత 2023-24తో ముగిసిపోతుంది. ఇప్పటి వరకు ఉన్న రైతుల రుణమాఫీ బాకీని ఒకే విడతగా ప్రభుత్వం విడుదల చేసి రైతులను రుణ విముక్తులను చేయాలని కోరుతున్నాం. ప్రస్తుతం బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. వారి రుణాలను తిరగవ్రాసి బుక్ అడ్జెస్ట్మెంట్ చేస్తున్నారు. రైతులు వ్యవసాయం కొరకు నగలు తాకట్టు పెట్టి వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి రుణాలు తీసుకుని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2023 వానాకాలం పంటలు వేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు పెట్టుబడి చాలా అవసరం. ప్రభుత్వం ఇచ్చే రైతుబంధుతోపాటు బ్యాంకు రుణాలు కూడా అందుబాటులోకి వస్తే రైతుల పెట్టుబడికి ఇబ్బంది తప్పుతుంది. కాబట్టి వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని కొత్త రుణాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు ఉద్యమాలు నిర్మిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బొమ్మిడి సాయికృష్ణ, బోనగిరి లింగం, ఉత్కం రమేష్ తదితరులు పాల్గొన్నారు.