సంగారెడ్డి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంగారెడ్డి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడింది. ఈ సందర్భంగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీమతి జి భవాని చంద్ర మాట్లాడుతూ, ఈ లోక్ అదాలత్ ద్వారా వివిధ వివాదాలు, కేసుల పరిష్కారం సాధించవచ్చని తెలిపారు.
శ్రీమతి భవాని చంద్ర మాట్లాడుతూ, “రాజీ చేయదగ్గ కేసులు, భార్యాభర్తల మధ్య చిన్న వివాదాలు, ఎక్సైజ్, బ్యాంకు రికవరీ, క్రిమినల్, సివిల్, సైబర్ క్రైమ్ వంటి అనేక కేసులలో ఇరువర్గాలు రాజీ కుదుర్చుకోవచ్చు. కొంతమంది క్షణికావేశంలో చిన్న చిన్న గొడవల కారణంగా కేసులు నమోదవుతాయి. ఇవి కోర్టు చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తాయి. కానీ, ఈ లోక్ అదాలత్ ద్వారా వారు సామరస్యంగా, స్నేహభావంతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు” అని తెలిపారు.
ఈ లోక్ అదాలత్ ద్వారా 5138 కేసులు పరిష్కరించబడ్డాయి. వాటిలో ముఖ్యంగా:
- క్రిమినల్ కాంపౌండేల్ కేసులు – 4656
- సివిల్ కేసులు – 11
- మోటారు వాహన ప్రమాద పరిహారం కేసులు – 16, రూ.99,66,000/-
- ప్రీ-లిటిగేషన్ కేసులు – 03
- బ్యాంకు రికవరీ కేసులు – 266, రూ.1,90,11,500/-
- సైబర్ క్రైమ్ కేసులు – 103, రూ.10,43,343/-
- భూసేకరణ కేసులు – 11, రూ.14,66,68,025/-
- విద్యుత్ చౌర్యం నిరోధక కేసులు – 72, రూ.2,00,000/-
మొత్తం: 5138 కేసులు
ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ మూర్తులు, సెషన్ జడ్జులు, సీనియర్ సివిల్ జడ్జీలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, అడ్వకేట్లు, పోలీస్ అధికారులు, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.