వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులను ఉద్దేశిస్తూ వాడిన భాషపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళా అధికారితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులను అరేయ్, ఒరేయ్ అంటూ మాట్లాడారు.
విజయసాయిరెడ్డి వాడిన పదజాలంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గారు… మీపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు పెట్టిన ప్రెస్ మీట్ లో మీరు వాడిన భాష తీవ్ర అభ్యంతరకరమని లోకేశ్ అన్నారు. మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో మీరు దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. పెద్దల సభ ప్రతినిధిగా ఉన్న మీకు తాను మంచీమర్యాదల గురించి చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. మీకు అధికారం పోయినా అహంకారం మాత్రం ఇంకా తగ్గలేదని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో మీ భాష, ప్రవర్తన, అవినీతి, అరాచకం చూసి ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు