పరిశ్రమల స్థాపనకు భారత దేశంలో లో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో అనువైన వాతావరణాన్ని కల్పించి, ప్రోత్సహకాలు అందజేస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్ లో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ ఫోరం లీడర్ షిప్ సమ్మిట్ లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
ఈ సదస్సుకు ఫోరమ్ చైర్మన్, జేసీ2 వెంచర్స్ వ్యవస్థాపకుడు జాన్ ఛాంబర్స్ అధ్యక్షత వహించారు. ఫైర్ సైడ్ సంభాషణలో ఆపిల్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ విరాట్ భాటియా అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సూటిగా సమాధానాలిచ్చారు.
నేడు వేగంగా మారుతున్న అధునాతన సాంకేతిక ప్రక్రియలో స్టార్టప్ అంధ్ర అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, పరిపాలన విధానాన్ని సమూలంగా మార్చే ఓ అద్భుతమైన ఆయుధంగా ఉపయోగపడుతోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. అంకురాల ద్వారా సాంకేతికతను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలు అన్వేషిస్తున్నట్లు చెప్పారు.
గత నెలలో ఏపీలో సంభవించిన వరద విపత్తును సమర్థంగా ఎదుర్కోవడంలో అంకుర సంస్థల వినియోగం ఓ నూతన అధ్యాయంగా అభివర్ణించారు. సెప్టెంబర్ మొదటి వారంలో వరద ముంచెత్తినప్పుడు శాఖల మధ్య సమన్వయం, సవాళ్ళను సమర్థంగా ఎదుర్కొనేందుకే అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు.
సహాయక చర్యల కోసం తొలిసారిగా తమ ప్రభుత్వం డ్రోన్‌ల వినియోగాన్ని ప్రారంభించిందని లోకేశ్ వివరించారు. విజయవాడలో 40 కిలోల వరకు మోసుకెళ్లగల డ్రోన్‌లను వినియోగించామని, ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు