ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఒక కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలన్నీ పనికిమాలిన సలహాలేనని అన్నారు. సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని దుయ్యబట్టారు. సీఎం సలహాదారుడే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఎద్దేవా చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో నిర్వహించిన శంఖారావం బహిరంగసభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని లోకేశ్ అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని.. రేపోమాపో విచారణ నివేదిక వస్తుందని… అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. అధికారులు నీతి, నిజాయతీతో పని చేయాలని చెప్పారు. తన రెడ్ బుక్ లో ఎక్కాలని అధికారులు ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నించారు.
జగన్ ఒక 420 అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పై 420 కేసులు 28 ఉన్నాయని చెప్పారు. తనకు క్లాస్ మేట్స్ ఉంటే… జగన్ కు జైల్ మేట్స్ ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే చెత్త కేబినెట్ అని జగన్ కేబినెట్ కు అవార్డు వచ్చిందని అన్నారు. ఏపీ మంత్రులను అర్ధరాత్రి లేపి అడిగితే… వారి శాఖలు ఏమిటో కూడా వారు చెప్పలేరని సెటైర్ వేశారు. వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ అనుకుంటోందని అన్నారు. ఉత్తరాంధ్ర ఒక పోరాటాల గడ్డ అని… ఎన్ని కేసులు పెట్టినా భయపడని కార్యకర్తలకు వందనం చేస్తున్నానని చెప్పారు.