తెనాలికి చెందిన గీతాంజలి అనే యువతి మృతి చెందిన ఘటనపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్ వల్ల తనకు మేలు జరిగిందని గీతాంజలి చెప్పడంతో ఆమెను విపక్షాలు టార్గెట్ చేశాయని, ట్రోలింగ్ భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది.
అందుకు బదులుగా టీడీపీ ఓ వీడియో పంచుకుంది. ఘటన స్థలం వద్ద కొందరి వాయిస్ లతో కూడిన ఆ వీడియోలో… “ఆమెను ఇద్దరు తోసేశారంట” అని ఓ వ్యక్తి చెప్పడం గమనించవచ్చు.
తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ప్రతి ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అసలు, సైకో జగన్ పార్టీ వైసీపీ పుట్టిందే తండ్రి శవం దగ్గర అంటూ లోకేశ్ విమర్శించారు. బాబాయ్ బలితో 2019లో ఓట్లు దండుకుంది అని, ఇప్పుడు ఎందుకోసం గీతాంజలిని బలి తీసుకుందో? అని సందేహం వెలిబుచ్చారు. ఇంకా ఈ బలి జాబితాలో ఎందరు ఉన్నారో? అని ఆందోళన వ్యక్తం చేశారు.
“వైఎస్సార్ మరణంతో వైసీపీ పుట్టింది. గత ఎన్నికల వేళ బాబాయ్ శవంతో ఓట్లు పొందింది. వైసీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమైన ప్రస్తుత దశలో ఓ మహిళ శవంతో వికృత రాజకీయాలు ఆరంభించింది. గీతాంజలి అనే ఆమెతో బలవంతంగా వీడియో రూపంలో అబద్ధాలు చెప్పించారు. ఆమె 7వ తేదీన ప్రమాదానికి గురైందో, ఆత్మహత్యాయత్నం చేసిందో తెలియదు కానీ… తీవ్రంగా గాయపడితే మెరుగైన చికిత్స అందించే ప్రయత్నం కూడా చేయలేదు ఈ వైసీపీ సైకోలు.
ఆమె నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడితే వైసీపీ సైకోలు అటువైపు కూడా చూడలేదు. చనిపోయిన తర్వాత మాత్రం మృతదేహంతో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నారు. గీతాంజలితో వైసీపీలోని పిల్ల సజ్జల గ్యాంగ్ చెప్పించిన అబద్ధాలను ఖండిస్తూ, టీడీపీ అభిమానులు ఆధారాలతో సహా 10వ తేదీన ప్రశ్నించారు.
ఇవన్నీ చూస్తుంటే… బాబాయ్ గొడ్డలిపోటును గుండెపోటుగా ప్రచారం చేసిన గ్యాంగ్… ఈ మరణాలన్నీ తమ వికృత రాజకీయాలకు వాడుకుంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతోంది” అంటూ నారా లోకేశ్ ట్వీట్ చేశారు.