contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి… హైకోర్టు తీర్పు చెంపపెట్టు : లోకేశ్

2018 నాటి ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్‌లో భాగంగా నిర్వహించిన మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు బుధవారం ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. కోర్టు ఇచ్చిన తీర్పు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన సీఎం జగన్‌కి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. ప్ర‌జా ఆకాంక్ష‌ల మేర‌కు త్వ‌ర‌లో ప్రజా ప్ర‌భుత్వం ఏర్పడుతుందని అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ భ‌ర్తీని చేపడతామన్నారు. ఏపీపీఎస్సీని జగన్ వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని నారా లోకేష్ మండిపడ్డారు. 2018 గ్రూప్-1 మూల్యాంకనంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిర్ధారిస్తూ మెయిన్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామ‌ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్ర‌క‌ట‌న‌ విడుదల చేశారు.

ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న సమయంలో 2.30 ల‌క్ష‌లకు పైగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని జగన్ హామీ ఇచ్చారని నారా లోకేశ్ ప్రస్తావించారు. ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 1నే ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల వివ‌రాల‌తో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాన‌ని హామీ ఇచ్చి విస్మ‌రించార‌ని మండిపడ్డారు. సీఎం అయ్యాక జగన్ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తాన‌ని, సాక్షి క్యాలెండ‌ర్ చేతిలో పెట్టాడ‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చివ‌రికి గ్రూప్-1 పేప‌ర్ల వాల్యూయేష‌న్‌ని ఇష్టారాజ్యంగా నిర్వ‌హించి నిరుద్యోగుల ఉసురు పోసుకుంద‌ని వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ మండిపడ్డారు.

టీడీపీ హయాంలో 169 గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని నారా లోకేశ్ ప్రస్తావించారు. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌ల మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించారు. వైసీపీ నేతలు, త‌న బంధువుల‌తో ఏపీపీఎస్సీని నింపేసి వైసీపీఎస్సీగా మార్చేశార‌ని నిందించారు. ఎటువంటి అర్హ‌త‌లు లేకున్నా వైసీపీ నేతలు, జగన్ బంధువులు ఏపీపీఎస్సీ స‌భ్యులుగా చేరి మొత్తం ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌ని, మూల్యాంక‌నాన్ని, ఇంట‌ర్వ్యూ ప‌ద్ధ‌తుల్ని పాత‌రేశార‌ని మండిప‌డ్డారు. టీడీపీ పాలనలో ప్రిలిమ్స్, మెయిన్స్ ప‌రీక్ష‌లు రాసిన ప్ర‌తిభావంతుల పేప‌ర్లు 3 సార్లు మూల్యాంకనం చేసి అర్హులంద‌రినీ త‌ప్పించి త‌మ‌వారికి పోస్టులొచ్చేలా మార్కులు మార్చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడార‌ని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

49 వేల ఓఎంఆర్ షీట్లు మార్చేశార‌ని నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు చేస్తున్న‌ ఆరోప‌ణ‌లపై జ‌గ‌న్ స‌ర్కారు మౌనం వ‌హించ‌డం వెనుక కుట్ర కోణాన్ని వెల్ల‌డిస్తోంద‌ని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ప్ర‌జాఆకాంక్ష‌ల మేర‌కు త్వ‌ర‌లో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వస్తుందని, కోర్టు ఆదేశాల మేరకు పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌న్నీ భ‌ర్తీ చేస్తామ‌ని ఈ సందర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు. గ్రూప్-1 అభ్య‌ర్థులు, నిరుద్యోగులు ఎవ‌రూ అధైర్య‌ప‌డొద్ద‌ని ఆయన భ‌రోసా ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :