తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాముకు తలలోనే విషం ఉంటుందని, జగన్ కు వళ్లంతా విషమేనని అన్నారు.
చంద్రబాబు జోలికి రావడం సైకో జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని పేర్కొన్నారు. జగన్ రాజకీయంగా, వ్యక్తిగతంగా భారీ మూల్యం చెల్లించబోతున్నారని హెచ్చరించారు. జగన్ ను డైరెక్ట్ గా అడుతున్నా… నీ చరిత్ర ఏంటి? జగన్ నీపై ఎన్ని కేసులున్నాయి? వాటి వివరాలను మాలాగా పబ్లిగ్గా చెప్పగలవా? అంటూ సవాల్ విసిరారు.
జగన్ పై 38 కేసులున్నాయి… వాటిలో 10 సీబీఐ కేసులు, 7 ఈడీ కేసులు, 21 ఇతర కేసులున్నాయి… జగన్ పై కేసులు పదేళ్లుగా ట్రయల్ కూడా రావడంలేదు… జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతోంది అని విమర్శించారు.
మా కంపెనీకి డబ్బు వచ్చిందంటున్నారు… ఎలా వచ్చిందో చెప్పలేకపోయారు… మా కంపెనీ వ్యవహారాలన్నీ పారదర్శకమే. మా కుటుంబ సభ్యులమే డైరెక్టర్లుగా ఉన్నాం. మా ఆస్తులు, వాటాలు, షేర్ల వివరాలు కూడా బయటపెట్టాం. ఎందుకీ దొంగ కేసులు, కక్ష సాధింపులు? అంటూ లోకేశ్ మండిపడ్డారు.
2021లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే, రెండేళ్ల తర్వాత, అది కూడా 36 మంది తర్వాత 37వ వాడిగా చంద్రబాబు పేరు చేర్చారని లోకేశ్ విమర్శించారు. ఇంతకంటే కక్ష సాధింపు ఉంటుందా? అని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అరెస్ట్ ను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. జోహో సంస్థ సీఈవో శ్రీధర్ వెంబు తదితరులు ఖండించారని లోకేశ్ వెల్లడించారు. పింక్ డైమండ్, వివేకానందరెడ్డి హత్య, కోడి కత్తి కేసుల్లో ఎంత అబద్ధం ఉందో ఈ కేసులోనూ అంతే అబద్ధం ఉందని అన్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబుకు, ఆయనకు చెందినవారి ఖాతాల్లోకి సొమ్ము వెళ్లిందన్న ఆరోపణలను నిరూపించలేకపోయారని తెలిపారు.
“చంద్రబాబు ఎప్పుడూ ఉద్యోగాలు, పరిశ్రమలు, అభివృద్ధి గురించే ఆలోచిస్తారు. ప్రజలు, రాష్ట్రం, దేశం తప్ప మరేమీ ఆలోచించని వ్యక్తి చంద్రబాబు. దేశ రాజకీయాల్లో అరుదైన గుర్తింపు ఉన్న నేత చంద్రబాబు. చంద్రబాబు అంటే ఓ బ్రాండ్ అని బిల్ గేట్స్, బిల్ క్లింటన్, ఫార్చ్యూన్ 500 సీఈవోలు కూడా చెబుతారు. ప్రజాసేవ తప్ప అవినీతి అనేది మా రక్తంలోనే లేదు.
జగన్ కు పాలన అంటే తెలుసా? చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడు. మేం ఇవాళ ప్రజల ముందుకు ధైర్యంగా వచ్చి వివరణ ఇస్తున్నాం… నీపై ఉన్న కేసుల గురించి నువ్వు ప్రజలకు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పగలవా? బాబాయ్ హత్య కేసులో దోషులను కాపాడుతోంది నువ్వు కాదా? అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ వస్తే… కర్నూలులో శాంతిభద్రతల సమస్య ఉందని సీబీఐకి పోలీసులను అడ్డుగా పెట్టింది ఎవరు?
తనపై ఉన్న అవినీతి బురదను జగన్ ఈ రాష్ట్రంలోని నేతలందరికీ అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై అవినీతి ముద్ర పడలేదు కానీ, జగన్ సైకోయిజం ఎంత పరాకాష్ఠకు చేరుకుందో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం అనేది ఒక ఫేక్ కేసు. చంద్రబాబు ఫోర్జరీ చేసినట్టు గానీ, చంద్రబాబుకు డబ్బులు వచ్చినట్టు గానీ, చంద్రబాబు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు తీసుకున్నట్టు గానీ ఈ ప్రభుత్వం రిమాండ్ రిపోర్టులో చూపించలేకపోయింది.
2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ గారు ఉన్న సమయంలో ఇదే ప్రాజెక్టును ఆ రాష్ట్రంలోనూ అమలు చేశారు. ఇదే కంపెనీ వాళ్లు అక్కడ ఆ ప్రాజెక్టులోనూ సంతకాలు చేశారు. యువతకు అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మన రాష్ట్రంలోనూ తీసుకువచ్చింది.
ఈ ప్రాజెక్టును అధ్యయనం చేసింది ప్రేమచంద్రారెడ్డి… ఆనాడు ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది అజేయ కల్లం. ఆ ఇద్దరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారు. కానీ వాళ్లపై ఈ ప్రభుత్వం ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు… ఎందుకు?
2021 డిసెంబరులో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. 36 మంది ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వం 30 మందిని అరెస్ట్ చేసింది. 4 దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించినా, ఈ ప్రభుత్వం గత రెండేళ్లుగా ఒక్క చార్జిషీటు కూడా దాఖలు చేయలేకపోయింది… దీనర్థం ఒక్కటే… తప్పు జరగలేదు. ఈడీ రిపోర్టులోనూ మనీలాండరింగ్ జరగలేదు అని స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుతున్నా… చంద్రబాబుకు డబ్బులు ఎక్కడ వచ్చాయో ఇప్పుడైనా నిరూపించగలరా? పబ్లిక్ స్టేట్ మెంట్లు ఇవ్వడం కాదు… ఆధారాలతో చెప్పగలరా? షెల్ కంపెనీలు అని చెబుతున్నారు కదా… వాటి బినామీల పేర్లు బయటపెట్టగలరా? ఇవాళ ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకు పంపించి, మంత్రులు సంబరాలు చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలు గమనించాలి. సీఐడీ అనేది రాష్ట్రంలో కక్ష సాధింపు డిపార్ట్ మెంట్ గా మారిపోయింది” అంటూ లోకేశ్ ధ్వజమెత్తారు.
ఇక, ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయం తమకు తెలుసని, కేంద్రం కూడా ఉందో లేదో బీజేపీ మిత్రులనే అడగాలని లోకేశ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.