మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి తమ వద్ద వీడియో ఫుటేజీ ఉందని.. దాని ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.ఎవరెవరు ఏమేం చేశారో ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విధ్వంస ఘటనలో గాయపడిన వారి నుంచి కూడా ఫిర్యాదులు తీసుకున్నామని తెలిపారు. ఒకవేళ పార్టీలు ర్యాలీ తలపెడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
”మాచర్లలో సాయంత్రం 6.30-7.30 గంటల మధ్య ఘర్షణలు జరిగాయి. వైకాపా, తెదేపా రెండు పార్టీల నేతలు పరస్పరం రెచ్చగొట్టుకున్నారు. మాచర్లలో జరిగిన ప్రతి ఘటనపైనా ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షిస్తాం. తెదేపా కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి జనసమీకరణ చేశారు. ఏయే గ్రామాల నుంచి ఎందరు వచ్చారో దానిపైనా ఆరా తీస్తున్నాం” అని డీఐజీ వెల్లడించారు.