అన్నమయ్య జిల్లా , మదనపల్లి : మదనపల్లి పట్టణ శివారు ప్రాంతమైన,అన్నమయ్య సర్కిల్ సమీపంలో నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మాజీ సైనికుల సంఘం డివిజన్ అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు డిమాండ్ చేశారు. శనివారం మాజీ ఎమ్మెల్యే రమేష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని మాజీ సైనికులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కంచర్ల శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ బికేపల్లి రెవెన్యూ గ్రామంలోని సర్వేనెంబర్ 8/1 లో మూడు ఎకరాల పరంబోకి ఉందన్నారు. నీటి వనరులకు సంబంధించిన ఈ భూమిలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి అక్రమ కట్టడాలు నిర్మించరాదని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 1995లో అప్పటి రెవిన్యూ అధికారులు 142 మంది మాజీ సైనికులకు చింత చెట్ల పలసాయాన్ని అనుభవించుటకు ట్రూసి పట్టాలను ఇచ్చారని తెలిపారు. ఈ భూమి తమదేనని బాలాజీ రావు అభ్యంతరం తెలపడంతో 2004లో సీసీఎల్ఏ కోర్టుకు వెళ్లిందన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే రమేష్ అప్పటి తాహసిల్దార్ శివరామిరెడ్డి అండతో 2016లో ఇంద్రసేన రాజు అనే మాజీ సైనికుని పేరుతో నకిలీ పట్టాలు సృష్టించారన్నారు. వీటి ఆధారంగా ఈ భూమిని మాజీ ఎమ్మెల్యే, అతని భార్య సరళమ్మ ఇద్దరి పేరుతో మదనపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై మాజీ సైనికుల సంఘం మాజీ ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసు పెట్టాలని అప్పటి రెవెన్యూ అధికారులను కోరినట్లు చెప్పారు. దీంతో అప్పటి తాహసిల్దార్ లు నాగార్జున రెడ్డి, మహమ్మద్ రఫీ, కుప్పు స్వామి, పీకే శ్రీనివాసులు వివిధ దశలలో సమగ్ర విచారణ జరిపి అక్రమాలను నిర్ధారించినట్లు ఉన్నతాధికారులకు నివేదికలు అందజేసినట్లు తెలిపారు. ఈ భూమి నిషేధిత జాబితాలో చేర్చారని చెప్పారు. డబ్ల్యూ పి నెంబర్ 14030/2017అండ్ డబ్ల్యూ పి 42158/2017లో చట్ట ప్రకారం మాజీ ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఏడు సంవత్సరాలుగా రెవిన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం చెందారు. నిషేధిత ఈ భూమిలో భవనాలు, నేషనల్ హైవేకు ఆనుకొని పెద్దపెద్ద షెడ్లు నిర్మించి బాడుగలు వసూలు చేయడం జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా సీసీఎల్ఏ కోర్టు ఏడాదిన్నర క్రితం మాజీ సైనికులకు ట్రూసి పట్టాలు ఇవ్వడం సమర్థించి, నకిలీ పట్టాలు సృష్టించిన మాజీ ఎమ్మెల్యే రమేష్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవిన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అంతేకాకుండా ఇదే స్థలంలో వే బ్రిడ్జి నిర్మించారని సబ్ కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే పైన ఎలాంటి చర్యలు తీసుకొని ప్రస్తుత తహసీల్దార్ ఖాజాబీ, డిప్యూటీ తాహసిల్దార్ అస్లాంలను సస్పెండ్ చేయాలని కంచర్ల శ్రీనివాసులు నాయుడు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సైనికులు పాల్గొన్నారు.