మణిపుర్‌లో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై ఆందోళనకారులు దాడులకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో భద్రతా బలగాల, నిరసనకాలు మధ్య ఘర్షణ జరిగింది. అంతే కాకుండా సీఎం అల్లుడి నివాసం సహా ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపైనా కూడా ఆందోళనకారులు దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి ఇళ్లలోకి చొరబడి ఫర్నిచర్, వాహనాలను, ఇతర సామగ్రని తగలబెట్టారని చెప్పారు.
జిరిబామ్ జిల్లాలో అనుమానస్పదంగా మృతి చెందిన ముగ్గురు వ్యక్తులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం ఆందోళన కారులు నిరసనలకు దిగారు. 24గంటల్లో హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం బిరెన్ సింగ్ అల్లుడి ఇళ్లతో సహా ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు నిరసనకారులు ఆందోళన చేశారు. ఆ తర్వాత ఇళ్లకు నిప్పు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. భద్రత దళాలు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టినట్లు వెల్లడించారు. ఈ ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు. అల్లర్లపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిపై తీవ్రచర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలకు ఆదేశాలు జారీచేసింది.
‘AFSPA వెనక్కితీసుకోండి’
ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో విధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్, 1958- AFSPA చట్టాన్ని సమీక్షించి ఉపసంహరించుకోవాల్సిందిగా కేంద్రాన్ని కోరింది మణిపుర్ ప్రభుత్వం. ఈ విషయం గురించి నవంబర్ 15న రాష్ట్ర కేబినెట్ చర్చించిందని కేంద్రానికి రాసిన లేఖలో హో సెక్రటరీ పేర్కొన్నారు.
ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సెక్మాయ్ PS, లాంసాంగ్ PS, ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లామ్లై, బిష్ణుపుర్ జిల్లాలోని మోయిరాంగ్, కాంగ్‌పోక్పి జిల్లాలోని లీమాఖోంగ్, జిరిబామ్ జిల్లాలోని జిరిబామ్ పోలీస్ స్టేషన్ పరిధిలో AFSPAను నవంబర్ 14న కేంద్రం మళ్లీ అమలు చేసింది.
మోదీజీ- మణిపుర్‌ను సందర్శించండి : రాహుల్ గాంధీ
మణిపుర్‌లో ఇటీవల జరుగుతున్న వరుస హింసాత్మక ఘటనలు, రక్తపాతం కొనసాగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ మణిపుర్‌ను సందర్శించాలని, ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు. ఏడాది విభజన, బాధల తర్వాత- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సయోధ్య కోసం ప్రయత్నించి పరిష్కారాన్ని కనుగొంటాయని ప్రతి భారతీయుడు ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
కాగా, మణిపుర్‌లో ప్రధాని మోదీ పర్యటించాలని చాలా కాలంగా కాంగ్రెస్ పట్టుబడుతోంది. మణిపుర్‌లో శాంతి స్థాపన కోసం కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేస్తోంది. గతంలో ఈ అంశంపై పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలని తీవ్ర నిరసనలు చేసింది కాంగ్రెస్.