పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (సబ్ సెంటర్లు) కు గతంలో ఎప్పుడూ లేనివిధంగా 12 జాతీయ నాణ్యత హామీ ప్రమాణ సర్టిఫికెట్స్ వచ్చే విధంగా కృషిచేసిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులను సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ గురువారం అభినందించారు. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ సిస్టం రిసోర్స్ సెంటర్ లకు చెందిన కేంద్ర ప్రభుత్వ వైద్య ఉన్నత అధికారులు జిల్లాలోని 15 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో (సబ్ సెంటర్లు) ఉన్న మౌలిక వసతులు, రోగులకు సిబ్బంది అందించే వైద్యసేవలలో నాణ్యతలతో పాటు మందులు పంపిణీ, టీకాలు వేయడం, గర్భిణీలకు ఆరోగ్య పరిరక్షణ తదితర విభాగాల ద్వారా అందిస్తున్న సేవలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గల నేషనల్ హెల్త్ సిస్టం రీసోర్ సెంటర్ (ఎన్ ఎస్ ఆర్ సి) పరిశీలనలో 12 సబ్ సెంటర్లు ద్వారా సంతృప్తికరమైన సేవలు అందుతున్నట్లు నేషనల్ హెల్త్ రిసోర్స్ సెంటర్ ఉన్నతాధికారులు గుర్తించారు. ఆయా సబ్ సెంటర్ లకు నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్స్ సర్టిఫికెట్స్ ను మంజూరు చేశారు. ఒకేసారి జిల్లాలో 12 సబ్ సెంటర్ లకు ఎన్కాస్ సర్టిఫికెట్లు మంజూరు కావడం, ఇందులో గిరిజన ప్రాంతాల్లో గల సబ్ సెంటర్లు ఎక్కువగా ఉండటం పట్ల జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, దీనికి కృషి చేసిన అందరినీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గిరిజన ప్రాంతాలు, మైదాన ప్రాంతాల ప్రజలకు అవసరమైన నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
