తుర్కియే (టర్కీ): వాయవ్య తుర్కియేలోని పాప్యులర్ స్కీ రిసార్ట్‌లో ఉన్న ఓ 12 అంతస్తుల హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బోలు ప్రావిన్స్ కొరొగ్లు పర్వత ప్రాంతంలోని కర్తల్‌కయ వద్ద ఉన్న గ్రాండ్ కర్తాల్ హోటల్‌లో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు చోటు చేసుకుంది.
స్కూళ్లకు శీతాకాల సెలవులు కావడంతో పర్యాటకులతో హోటళ్లు కిక్కిరిసిపోయాయి. ఈ కారణంగానే మృతుల సంఖ్య భారీగా ఉందని తుర్కియే అంతర్గత వ్యవహారాలశాఖ మంత్రి అలీ యెర్లికయే తెలిపారు. ఈ ఘటనతో తమ హృదయాలు బద్దలయ్యాయని, ఘటనకు కారణమైన వారు తప్పించుకోలేరని హెచ్చరించారు.
పై అంతస్తుల్లో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడిందని, కొందరు దుప్పట్లు ఉపయోగించి కిందికి దిగేందుకు ప్రయత్నించారని హోటల్ మూడో అంతస్తులో ఉన్న పర్యాటకుడు యెల్కోవన్ తెలిపారు. ఇప్పటి వరకు చనిపోయిన 76 మందిని గుర్తించామని, 45 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని మంత్రి తెలిపారు. ప్రమాద సమయంలో హోటల్‌లో 238 మంది ఉన్నారు. తెల్లవారుజామున 3.27 గంటలకు ప్రమాదం సంభవిస్తే 4.15 గంటలకు అగ్నిమాపక సిబ్బంది హోటల్‌కు చేరుకున్నారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.