ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పిన్నెల్లిని తరలిస్తున్న సమయంలో మాచర్ల కోర్టు వద్ద ఆయన తన పొట్టలో పిడికిలితో బలంగా గుద్దారంటూ తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివ చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 323 కింద మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ నేతపై దాడిచేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న మే 13న పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ నేతపై దాడిచేశారు. ప్రశ్నించిన మహిళపైనా దౌర్జన్యానికి దిగారు. ఈ నేపథ్యంలో ఆయనపై నాలుగు కేసులు నమోదు కాగా, ఆయన పెట్టుకున్న నాలుగు ముందస్తు బెయిలు పిటిషన్లను కోర్టు కొట్టివేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా, ఆయనపై మరో కేసు నమోదైంది.