ఈరోజు ప్రపంచ కార్మిక హక్కుల పోరాట దినం “మేడే” సందర్భంగా ఎం సి పి ఐ ఆధ్వర్యంలో పిడుగురాళ్ల పిల్లుట్ల రోడ్డు సున్నపు బట్టీల దగ్గర ఎర్ర జెండాను ఎగురవేసి పోరాట అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎం సి పి ఐ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఓర్సు కృష్ణ మాట్లాడుతూ శ్రామిక ప్రజానీకానికి, కార్మికులకు హక్కులు సాధించబడిన రోజు మేడే అని మేడే పోరాట స్ఫూర్తి వల్లనే కార్మిక వర్గానికి ప్రజలకు అనేక హక్కులు కల్పించబడ్డాయని, రోజుకు ఎనిమిది గంటల పని దినం, కనీస వేతనాల అమలు కనీస సౌకర్యాలు సాధించబడ్డాయన్నారు. 1886 మే ఒకటవ తేదీన అమెరికాలోని చికాగో నగరంలో పెట్టుబడిదారులు కార్మిక వర్గాన్ని దోచుకుంటుంటే ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యమై తమ హక్కుల సాధన కోసం ఉద్యమించి విజయం సాధించారని ఆనాడు కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి సాధించుకు హక్కులను నేటి పాలకులు కాలరాస్తూ కార్మికుల ప్రయోజనాలను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతు ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను దోచుకుంటున్నారని దేశంలో మతోన్మాద శక్తులు కార్మిక వర్గ ఐక్యతను దెబ్బ తీసే విధంగా కులాలు, మతాలు పేరుతో విచ్ఛిన్నం చేస్తు ప్రజలపై భారాలు వేసి పెట్టుబడిదారులు కార్పోరేటీకరణ విధానాలను అనుసరిస్తున్నారన్నారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులంతా రానున్న రోజుల్లో ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు ,ఆర్టిఐ కుమార్, అంబేద్కర్ ప్రచార సేవా సమితి అబ్రహం, సి టి యు నాయకులు నారాయణ, కోటేశ్వరరావు ,ఆంజనేయులు, పుల్లారెడ్డి, యూసఫ్ వలి తదితరులు పాల్గొన్నారు.
