మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను కాల్చివేయడం తప్పుడు పనులు లెక్కలేకుండా చేశారనడానికి నిదర్శనమని అన్నమయ్య జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు యనమల భగవాన్ సహాయ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో భూమి విలువ కోట్లల్లో ఉన్న ప్రాంతాలైన రాయచోటి, రాజంపేట, సుండుపల్లిలో కూడా వైఎస్సార్సీపీ నాయకులు అధికారులను లోబర్చుకుని విపరీతమైన భూకబ్జాలు, రికార్డుల టాంపరింగ్, దొంగ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారన్నారు. వాటిని కప్పి పుచ్చుకోవడానికి ఎంతటి ఘాతుకానికైనా దిగజారుతారని ఆరోపించారు. అందువల్ల అక్కడ కూడా మదనపల్లె లాంటి ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం లేకపోలేదన్నారు. అందువల్ల ఉన్నతాధికారులు అప్రమత్తమై అలాంటి ఘటనలకు చోటివ్వకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అలాంటి ఘటనలు పునరావృతమైతే మాత్రం ప్రస్తుతమున్న అధికారులే వాటికి బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.