అన్నమయ్య జిల్లా, మదనపల్లి : నియోజకవర్గం అంతటా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సంస్కృతి విస్తరించింది. ఇల్లు, దుకాణాలు, హోటళ్లు, టీ కేఫ్లు, కార్యాలయాలు ఇలా ఒకటేమిటి ఎక్కడ చూసినా ప్యూరిఫైడ్ క్యాన్ వాటర్ దర్శనమిస్తున్నాయి. ఈ క్యాన్లోనివి మినరల్ నీళ్లు అని, స్వచ్ఛమైనవని సేవిస్తున్నారు. అయితే ఇవి అంత శుద్ధమైనవేనా అనే ప్రశ్న మొదలైంది .
ప్లాంట్లపై పర్యవేక్షణ లేదు: రూ.కోట్లల్లో వ్యాపారం నిర్వహిస్తున్న ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లపై పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఈ నీటిని ఎవరైనా నమూనాలను సేకరించి నిర్ధారించి అనుమతులు ఇస్తున్నారా? ఈ నీళ్లను శుద్ధి చేస్తున్నారా లేదా? ఇవి సురక్షిత నీరేనా? అని చూసేవారు లేరు. కొన్నిసార్లు నీళ్ల క్యాన్లలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు ఫిర్యాదులు కూడా అందాయి. ఇలా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ల పేరిట జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. పలు సందర్భాల్లో డయేరియా కేసులు నమోదవుతూ ఉండటంతో ఈ నీళ్లపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ప్లాంట్ నుంచి గృహాలకు చేరే 20 లీటర్ల వాటర్ క్యానన్ను 90 సార్లకంటే ఎక్కువగా వాడకూడదు. కానీ ఇక్కడ మూడేళ్లు దాటినా అవే క్యాన్లను వినియోగిస్తూనే ఉన్నారు.
నీటి శుద్ధి ఇలా జరగాలి: ఆర్జే ప్లాంట్ ద్వారా నీటిని శుద్ధి చేస్తారు. ఆర్డీ అంటే రివర్స్ ఓస్మోసిస్. బోరు నుంచి వచ్చే నీటిలో మోతాదుకు మించి మినరల్స్ ఉంటాయి. ఎక్కువ మోతాదులో ఉంటే హాని కలిగిస్తాయి. వీటిలో మ్యాగ్నెషియం , రకరకాల సల్ఫేట్స్, బోరాన్, బేరియం, మాంగనీస్ వంటివి ఉంటాయి. ఎక్కువ మోతాదులో మినరల్స్ కలిగి ఉన్న నీటినే భారజలం అంటాం. టీడీఎస్ (టోటల్ డిస్పెన్స్డ్ సాలిడ్స్) అనికూడా అంటాం. వీటిని ఆర్డీ ప్లాంట్లు వడపోత నిర్వహించి భారజలాన్ని సాధారణ జలంగా మార్చాలి. వంద లీటర్లను ఆర్డీ ద్వారా ఫిల్టర్ చేస్తే మనకు పది నుంచి 15 లీటర్లు మాత్రమే తాగునీరు వస్తుంది. ఇందులో మూడు దశల్లో వడపోత జరగాలి. ఆర్డీలో ప్రీ ఫిల్టరైజేషన్ సాలిడ్ వాటర్ మొదటి దశ, ఉప్పుశాతాన్ని తగ్గించడం రెండోదశ. ఇక మూడోదశలో బ్యాక్టీరియాను తగ్గించే వడపోత ఉంటుంది. ఈ మూడు దశల్లో ఏది సరిగా జరగకపోయినా ఉపయోగం ఉండదు. నాణ్యమైన తాగునీరు కావాలంటే ఈ ఆర్జే ప్లాంట్లలో వాడే ఫిల్టర్లను తరచూ మారుస్తూ ఉండాలి.
ఫిల్టర్లు మార్చకుండానే: మినరల్ వాటర్ ప్లాంట్లలో ప్రతి 10 వేల లీటర్ల నీటికి ఒకసారి ఫిల్టర్లు మార్చాల్సి ఉంటుంది. అయితే నిర్వాహకులు నెలల తరబడి వీటిని మార్చకుండానే నీరు సరఫరా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బోరు నీరే నేరుగా వినియోగదారులకు సరఫరా అవుతోంది. ఫిల్టర్లు మార్చకపోవడంతో బ్యాక్టీరియా పెరగడం, నాచు వంటివి పేరుకుపోయి ఆ నీరు తాగిన వారు అనారోగ్యం పాలవుతున్నారు.
వ్యాధులు సంక్రమిస్తాయి: శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. డయేరియా, టైఫాయిడ్, కలరా, హెపటైటిస్ ఏ, డిసెంట్రీ (చీము రక్తంతో విరేచనాలు), కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా ఉంటుంది. అందువల్ల నీటి శుద్ధి గురించి అందరూ తెలుసుకోవాలి. టోటల్ డిసాల్వ్ సాలిడ్స్(టీడీఎస్) 100 నుంచి 300 శాతం లోపు ఉండాలి. ఇది తక్కువైనా, ఎక్కువైనా ఇబ్బందే. అలాంటి నీటిని వాడుకోవడం హానికరం.అందుకే తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించడంతోపాటు
తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
పోటాపోటీ వ్యాపారం: మినరల్ వాటర్కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో గల్లీకి ఒక ప్లాంట్ ఏర్పాటు చేసి పోటాపోటీగా వ్యాపారాలు చేస్తున్నారు. ఇక నీటి సరఫరాలోనూ దోపిడీ కనిపిస్తోంది. ప్లాంట్కు వెళ్లి తీసుకుంటే 20 లీటర్ల క్యాన్కు రూ.5 వసూలు చేస్తున్నారు. అదే 20 లీటర్ల క్యాను డోర్ డెలివరీ చేయాలంటే రూ.15 చెల్లించాలి. ఇక ఫస్ట్ ఫ్లోర్, సెకెండ్ ఫ్లోర్ అంటూ ఉంటే ఒక్కో ఫ్లోర్కు ఒక్కో ధర నిర్ణయిస్తూ… మొత్తంగా రూ.5 నుంచి రూ.25 వరకు తీసుకుంటున్నారు.అయితే దీనికి నిర్ణీతమైన ధరలు లేకపోవడంతో ఒక్కో ప్లాంట్ వారు ఒక్కోరకంగా వసూలు చేస్తున్నారు.