మదనపల్లి, 2024 నవంబర్ 7: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లాల వారీగా పార్టీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మదనపల్లి నుండి షేక్ రెడ్డి సాహెబ్ సహా జిల్లా, నియోజకవర్గ నేతలు తమ అభిప్రాయాలను షర్మిల ముందుకు తెచ్చారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశానికి దిశా… దశ చూపే దిక్సూచి” అని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర సమీక్షా సమావేశాలకు పూనుకున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి సంబంధించి నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, వాటిని తన స్వీయ పర్యవేక్షణలో పరిష్కరించుకునే విధంగా నాయకులకు భరోసా ఇచ్చారు.
మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ బలహీన పడడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోవడమే” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండుమార్లు వరుసగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చిన వైఎస్ఆర్, కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ అనేలా కీర్తించబడ్డారని ఆయన కొనియాడారు.
గత పదేళ్లుగా కష్టకర పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కు వైఎస్ షర్మిల కొత్త జవసత్వాలు నింపుతున్నారని రెడ్డీ సాహెబ్ కొనియాడారు. “కార్యకర్తల మనసెరిగిన వైఎస్ఆర్ బిడ్డగా, అన్ని స్థాయిల్లో సమస్యల పరిష్కారం ఆమెకు తెలుసు” అని తెలిపారు.
పీసీసీ బాధ్యతలు చేపట్టాక ఏడాది కూడా కాలేదు, మధ్యలో ఎన్నికలు రావడంతో నాయకులు, కార్యకర్తలను ప్రత్యేకంగా కలవలేక పోయినా, నేడు సమీక్షా సమావేశాలకు శ్రీకారం చుట్టారని అభినందించారు. ఈ సమీక్షలో ఇవిఎం ఎన్నికలను రద్దు చేసి తిరిగి బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరిగేలా ఉద్యమించాలని పీసీసీ ఛీఫ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్, మహమ్మద్, రామకృష్ణా రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు.