మెదక్, రామాయంపేట : మంత్రాలు చేస్తున్నదన్న నెపంతో ఓ మహిళపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాలలో జరిగింది. గురువారం రాత్రి గ్రామానికి చెందిన ధ్యాగల ముత్తవ్వ(50) అమావాస్య రోజు మంత్రాలు చేయడం వల్ల, తమ కుటుంబ సభ్యురాలు అనారోగ్యం పాలైందని కోపోద్రిక్తులై ఆమెను విపరీతంగా కొట్టారు. అనంతరం ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ముత్తవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. విషమ పరిస్థితిలో ఉన్న ఆమెను వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రాల నెపంతో తీవ్రంగా కొడుతున్న సందర్భంలో, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప ఆపడానికి ప్రయత్నం చేయకపోవడం విచారకరం. వరుసగా రెండు రోజులు రామాయంపేట మండలంలో మంత్రాల నెపంతో దాడులు జరగడాన్ని దృష్టిలో పెట్టుకుని, పోలీసులు అవగాహన కార్యక్రమంలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాట్రియాలలో జిల్లా ఎస్పీ పర్యటన ..
కాట్రియాలలో మంత్రాల నెపంతో సజీవ దహనం సందర్భంగా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గ్రామంలో పర్యటించారు. ముత్తవ్వను కొట్టి చంపిన కేసుపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామస్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ వెంకట రాజా గౌడ్ తదితరులున్నారు.