- తూప్రాన్ ఆర్డీవో కార్యాలయంలో నేడు నర్సంపల్లి, గుండ్రెడ్డీపల్లి, దాత్రపల్లీ, వెంకటాయాపల్లి రైతులు హాజరు
మెదక్ జిల్లా , తూప్రాన్: భారత్ మాల పరియోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ ఆర్ ఆర్) నిర్మాణానికి సంబంధించిన భూమి సేకరణ ప్రక్రియలో తాజాగా అభివృద్ధి చోటు చేసుకుంది. 143 హెక్టార్ల భూమికి గాను గత మే నెలలో జరిగిన అవార్డు ఎంక్వైరీ అనంతరం, 36.04 హెక్టార్లకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ 18.07.2024 తేదీన జిఏజెడ్ ఈ టిటీ ద్వారా జారీ చేయబడింది.
ఆర్డీవో జయ చంద్రా రెడ్డి వెల్లడించినట్లుగా, 21 రోజుల చట్టబద్ధ గడువు ముగిసిన తర్వాత, 25.09.2024 రోజున ఈ భూములకు సంబంధించిన డిక్లరేషన్ ప్రకటన కూడా జారీ చేయబడిందని తెలిపారు.
ఈ ప్రక్రియలో భాగంగా సోమవారం నాడు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నర్సంపల్లి, వెంకటాయపల్లి, గుండ్రెడ్డిపల్లి, కిష్టాపూర్ గ్రామాలలో భూమిని కోల్పోతున్న రైతులకు భూసేకరణ వివరాలు తెలియజేయడం జరిగింది. ఆర్డీవో వారు రైతుల యాజమాన్య పత్రాలను పరిశీలించారు.
రైతులు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సహకరించడానికి సిధ్ధంగా ఉన్నారు, కానీ బహిరంగ మార్కెట్‌లో నడుస్తున్న ధరలను చెల్లించాలనే అభ్యర్థనను ఆర్డీవోకు అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ జిల్లా కలెక్టర్ ద్వారా మరింత మంచి ధరలు నిర్ణయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్డీవో తెలిపారు.
ఈ భూమి సేకరణ ప్రక్రియతో రైతుల సమస్యలు మరియు వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.