మెదక్ జిల్లా: ప్రభుత్వ విభాగల ఉద్యోగులైతే నిబంధనలను భేషుగ్గా ఉల్లంఘించవచ్చునా? ఒకరి ఉల్లంఘనలను మరొకరు సహృదయంతో మన్నించాలనే రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఏమో.. విద్యుత్తు శాఖలోని ఆ సిబ్బంది తీరు ఇలాగే ఉంది. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఒకే బైక్‌పై ముగ్గురు వెళుతుండడం గమనించిన పోలీసులు నిబంధనల మేరకు జరిమానా విధించారు. దీనికి ప్రతిగా పట్టణంలోని రెండు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నళ్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేశారు ఆ సిబ్బంది.
నువ్వలా చేస్తే.. నేనిలా చేస్తా అన్నట్టుగా ఉన్న ఈ ఘటన ఇటీవల మెదక్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఉద్యోగ విధుల్లో భాగంగానే ట్రిపుల్ రైడ్‌తో వెళుతున్నాం అని చెప్పినా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారని విద్యత్ శాఖ సిబ్బంది వాపోయారు. అయితే ట్రాఫిక్ చలానాలు సరిచేస్తామని చెప్పినా కూడా సిగ్నళ్లకు విద్యత్ కనెక్షన్ తీసేశారని ట్రాఫిక్ సీఐ నాగరాజు చెప్పారు. ట్రాన్స్ కో అధికారులతో చర్చించడంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు వెల్లడించారు.