తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఓ మెగా మెడికల్ డే. లక్షలు కుమ్మరిస్తే కానీ అందని వైద్య విద్య.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విద్యార్థుకు ఉచితంగా లభిస్తుంది. కార్పొరేట్‌కు దీటుగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ ఒక్కరోజు రెండు రాష్ట్రాల్లో 14మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.
వైద్యవిద్య చరిత్రలో తెలంగాణ వరుసగా రికార్డులు సృష్టిస్తుంది. ఇవాళ ఒక్కరోజే ఏకంగా 9 కళాశాలల్లో తరగతులు ప్రారంభించేందుకు సిద్ధమైంది తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి ఎంబీబీఎస్ క్లాస్‌లు ప్రారంభం అవుతాయి. గత ఏడాది 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించారు. ఇప్పటివరకు తొమ్మిదేళ్లలోనే సీఎం కేసీఆర్ 29 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. అంటే సగటున ఏడాదికి మూడు కాలేజీలు ఏర్పారు చేశారు.
ఏపీలోనూ మెడికల్ కాలేజీలకు శ్రీకారం..
రాష్ట్ర చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నారు ముఖ్యమంత్రి జగన్. విజయనగరం జిల్లాలో ఇవాళ సీఎం జగన్ పర్యటించనున్నారు. విజయనగరం మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ప్రారంభం తరువాత ఐదు కళాశాలల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతారు సీఎం. అలాగే అక్కడ ఏర్పాటుచేసిన స్కిల్ ల్యాబ్, బయోకెమిస్ట్రీ ల్యాబ్, అనాటమీ మ్యూజియంలను పరిశీలిస్తారు.
మెడికల్ కాలేజీల ప్రారంభోత్సం కోసం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణ, తర్వాత నూతన మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం, ల్యాబ్‌ల పరిశీలన, మిగిలిన 4 మెడికల్ కాలేజీల వర్చువల్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం ప్రసంగిస్తారు. జీఓ నెంబర్ 33 ద్వారా జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీని నిర్మాణానికి ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించింది. 2021 మే 31న రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు జగన్ శంకుస్థాపన చేశారు. అయితే కార్పోరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రభుత్వ వైద్య కళాశాలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి