జగిత్యాల జిల్లా, మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలో దురదృష్టకర సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీ సాయి లక్ష్మీ నివాస్ ఆసుపత్రి లో పనిచేయుచున్న డాక్టర్ అశోక్ రెడ్డి, యశోద హాస్పిటల్ లో పనిచేయుచున్న డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి మరియు రాయికల్ పట్టణంలోని యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రశాంత్ కుమార్, అలాగే సాయి లక్ష్మీ నివాస్ ఆసుపత్రి యజమాని ఆత్మకూరి రాజు, లింగాల లిఖిత్ రెడ్డి కలిసి మెట్ పల్లి మండలంలోని మెట్ల చిట్టాపూర్ గ్రామానికి వెళ్లారు.
వారు అక్కడకు చేరుకున్న తర్వాత, అక్కడ ఉన్న వరద కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో, డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి మరియు ప్రశాంత్ కుమార్ ఇద్దరూ నీటిలోకి వెళ్లి ఈత కొట్టడం ప్రారంభించారు. అయితే, డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. ఈ సంఘటనను గమనించిన ప్రశాంత్ కుమార్ వెంటనే పైకి వచ్చి మిగతా వారికి సమాచారం ఇచ్చాడు
ఈ విషయం పై పోలీసులకు సమాచారం ఇవ్వగా .. వెంటనే మెట్ పల్లి డి.ఎస్పీ శ్రీ ఉమామహేశ్వరరావు, సి.ఐ. నిరంజన్ రెడ్డి మరియు ఎస్.ఐ. చిరంజీవి కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, ఉదయ్ కిరణ్ రెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ సంఘటనలో మునిగిపోయిన డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి హనుమకొండ జిల్లాకు చెందినవాడు, ఇతరులు మాత్రం భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలకు చెందినవారు. వారు గత కొంతకాలంగా మెట్ పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లుగా పనిచేస్తున్నారు
ఈ రోజు రాత్రి వరకు డాక్టర్ ఉదయ్ కిరణ్ రెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు తెలిపారు.