జగిత్యాల జిల్లా/ కోరుట్ల/ మెట్ పల్లి: వ్యాపారులు ప్రజల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఫైనాన్స్ వ్యాపారులు అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు. నిర్ణీత గడువులోగా అప్పు తిరిగి చెల్లించకపోతే రెండింతలు, మూడింతల విలువైన ఆస్తులను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు.
జిల్లాలో రిజిస్టరైన ఫైనాన్సుల పదుల సంఖ్యలో ఉండగా, వందలాది మంది పర్మిషన్లు లేకుండానే వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ దందా చేస్తున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అధిక వడ్డీలు వసూలు చేయడం, కుదువబెట్టిన ఆస్తులను తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అప్పులను క్లియర్ చేసినా తాకట్టు పెట్టిన ప్రాపర్టీస్ ను ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు.
కొందరు వ్యాపారులు అప్పు ఇచ్చేటప్పుడు నూటికి రూపాయి, రెండు రూపాయలు చెప్పి చివరకు 3 రూపాయల కంటే ఎక్కువే వడ్డీ వసూలు చేస్తున్నారు. గడువులోగా అప్పు చెల్లించకపోతే తక్కువ మొత్తానికే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. వడ్డీ వ్యాపారుల వలలో చిక్కిన పలువురు బాధితులు విలవిలలాడుతున్నారు. పరిస్థితుల ప్రభావంతో తమ సమస్యను బయటకు చెప్పుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.