రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు స్ట్రాంగ్ లీడర్ కావాలా? లేక రాంగ్ లీడర్ కావాలా? ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ… ఇదివరకు ఎంబీబీఎస్ చదవాలంటే ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ తెలంగాణ సిద్ధించాక ఇక్కడ ఉంటూనే వైద్య విద్య చదివే అవకాశం వచ్చిందన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. మన రాష్ట్ర విధానాన్ని చూసి కేంద్రం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ విధానాన్ని తీసుకువచ్చిందన్నారు.
ప్రజలకు మంచి చేసే పనులు మీడియాలో ఎక్కువగా కనిపించవని, కానీ ఎదుటి వారిని తిడితే వార్తల్లో ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారన్నారు. రాష్ట్రానికి పేపర్ లీడర్ కావాలా? ప్రాపర్ లీడర్ కావాలా? ప్రజలు ఆలోచించాలన్నారు.
తెలంగాణ ఫార్మా హబ్‌గానే కాకుండా నేడు హెల్త్ హబ్, ఐటీ హబ్‌గా ఎదిగిందన్నారు. తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయిందన్నారు. వైద్యుల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014లో 30 శాతం డెలివరీలు జరిగితే ఈ రోజు 72.8 శాతానికి పెరిగాయన్నారు.