తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాల సందర్భంగ మొదటిరోజు బుధవారం అంగరంగ వైభవంగా మేళతాళాలు,మంగళ వాయిద్యాల నడుమ కుటుంబసభ్యులతో కలసి శ్రీ తాతయ్య గుంట గంగమ్మతల్లికి సారె సమర్పించిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రాష్టంలోని వివిధ జిల్లాలకు చెందిన వివిధ రకాల కళాకారులు దారి పొడవునా జానపద శైలిలో సాగే అమ్మ వారి భక్తి కీర్తనలతో, డప్పు వాయిద్యాల నడుమ భక్తులు లయబధ్ధంగా చిందేస్తూ పులకించి పోతూ గంగమ్మ నామ స్మరణతో తిరునగరిని హోరెత్తించారు. నవదుర్గలు, కాంతారా, తప్పెటగుళ్లు, డప్పులు,తీన్ మార్, కీలు గుర్రాలు, కొమ్ము కొయ్య, దింసా, పగటి వేషగాళ్లు, పులివేషాలు, గరగల్లు, బోనాల కళాప్రదర్శలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే నివాసం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, నగరపాలక సంస్థ కమీషనర్ హరిత, ఆర్డివో కనక నరసారెడ్డి, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. సారె సమర్పించిన అనంతరం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ గంగమ్మ దేవతది చరిత్ర కాదని, ఎప్పుడైతే శ్రీ వేంకటేశ్వర స్వామి కొండమీద కొలువయ్యారో అప్పుడే గంగమ్మ తల్లిని తన చెల్లిలిగా తీసుకొచ్చారని అవధూత గణపతి సచ్చిదానంద స్వామి ఉటంకించడం జరిగిందన్నారు. చారిత్రక ఆధారాలను బట్టి ఇది పల్లవుల కాలం నాటి దేవాలయమని, శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన అనంతాళ్వార్ అమృత హస్తాలతో తిరిగి పునఃప్రతిష్టించిన దేవాలయమిదన్నారు. మళ్లీ 9 వందల సంవత్సరాల తర్వాత ఈ తరంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే వివరించారు. మహా కుంభాభిషేకానికి కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారు విచ్చేసి, అనుగ్రహ భాషణ చేయడం జరిగిందని, ఆ వెనువెంటనే విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు ప్రథమ దర్శనం చేసుకోవడం జరిగిందన్నారు. ఓ కార్యకర్తగా మా కుటుంబం తరఫున ఈ రోజు అమ్మ వారికి సారె సమర్పించడమైందన్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నది నా వ్యక్తి గత వ్యవహారానికి సంబంధించినట్టుగా కొంత మంది విషపుటాలోచనలు విరజిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి విమర్శలకు భయపడి అమ్మవారి సేవలను, ప్రజాహిత కార్యక్రమాలను ఆపేటంత అధైర్యస్తుడిని తాను కాదన్నారు. అమ్మ వారిని దర్శించిన శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ స్వరూపానందేంద్ర స్వామి, గణపతి స్వాముల వార్లు మా నిబధ్ధత, సచ్చీలత గురించి, అమ్మవారి పట్ల వున్న భక్తి గురించి వారి నోటితోనే వారు చాలా బాగా చెప్పారని, ఏదేమైనా సరే గంగమ్మ జాతర అంగరంగవైభవంగా జరుగుతుందని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు.