సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. సమాచారం అందకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతకు ఆమె కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లాస్య నందిత ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బీఆర్ఎస్ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి అప్పుడు పరామర్శించారు కూడా. కొన్ని రోజుల్లో మళ్లీ ఆమె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం విషాదంగా మారింది. ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్య నందిత. ఆయన చనిపోవడంతో బీఆర్ఎస్ లాస్య నందితకు సీటు ఇచ్చి పోటీ చేయించింది.