contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జాతికి మోడీ క్షమాపణ చెప్పాలి : సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

  • బిజెపి సమావేశమా… ప్రభుత్వ కార్యక్రమమా?
  • మోడీకి జై కొట్టకుంటే జైలుకు పంపుతున్నారు
  • బిజెపి వ్యతిరేక ప్రభుత్వాలను కూలదోసే కుట్ర
  • ప్రభుత్వ ధనంతో రైల్వేలకు ఖర్చుపెట్టి ప్రైవేటుకు అప్పగించనున్న మోడీ
  • ప్రజా క్షేత్రంలో ముద్దాయిగా మోడీ
  • సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ.

తిరుపతి:  హైదరాబాదులో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, వందే భారత్ రైలును ప్రారంభించిన నరేంద్ర మోడీ టిఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగ లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ మండిపడ్డారు. తక్షణం నరేంద్ర మోడీ జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రధానమంత్రి హోదాలో వచ్చిన మోడీ బిజెపి పార్టీ సమావేశంగా మార్చి వేయడం సిగ్గుచేటు అన్నారు. బిజెపి నేతగా సమావేశానికి వచ్చారా లేక ప్రధానిగా వచ్చారా సమాధానం చెప్పాలన్నారు. మోడీ ప్రసంగం మొత్తం తెలంగాణ ప్రభుత్వం పై దాడి చేసేలా సాగిందన్నారు. కెసిఆర్ బిజెపికి అనుకూలంగా ఉన్న రోజులలో అవినీతి ఎందుకు కనబడలేదని నేడు ఎందుకు తెరమీదకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తనకు జై కొట్టిన వారిని ఇళ్లకు పంపుతారని జై కొట్టని వారిని జైలుకు పంపడం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే కుట్రలో చేస్తున్నారని అందులో భాగంగానే తమిళనాడులో కుల ప్రస్తావనలను తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి వ్యతిరేక రాష్ట్రాలకు కేంద్రం నిధులు ఇవ్వకుండా పక్షపాత ధోరణి అవలంబిస్తుందని చెప్పారు. ప్రజల నుండి జీఎస్టీ రూపంలో వసూలు చేసిన డబ్బులు మోడీ ఖర్చు పెడుతున్నారని పేర్కొన్నారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని డిమాండ్ రాగానే రాహుల్ గాంధీపై రాజకీయ శిక్ష వేశారని పేర్కొన్నారు. ప్రజాధనంతో రైల్వేలకు ఖర్చు చేస్తున్నారని అందులో భాగంగానే వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారని చెప్పారు. వందే భారత్ రైళ్ల చార్జీలు విమాన చార్జీలను తలపిస్తున్నాయని అన్నారు. త్వరలో వీటిని ప్రైవేట్ వ్యక్తులకు మోడీ అప్పగిస్తారని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ తీరును ఎండగడతో 19 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావడం జరిగిందని ప్రజాక్షేత్రంలో మోడీని ముద్దాయిగా నిలబడతామని నారాయణ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం ఆర్థిక నేరగాళ్లకు నిలయంగా మారిందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రం నుండి వచ్చిన నిధులు వేరే వాటికి జగన్ మళ్లిస్తుంటే ఉండవల్లి ఎందుకు ప్రశ్నించలేదో సమాధానం చెప్పాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ తిరుపతి జిల్లా కార్యదర్శి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు ఉదయ్ పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :