తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చిందని… అయితే, ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు దూరమవుతున్నాయని విమర్శించారు. కుటుంబ పాలన ఉంటే ఇలాగే జరుగుతుందని చెప్పారు. ప్రతి ప్రాజెక్టులో తమ వారి స్వార్థాన్ని ఇక్కడి పాలకులు చూస్తున్నారంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ప్రజలను ఆకాంక్షలను, రాష్ట్ర అభివృద్ధిని కొందరు అడ్డుకుంటున్నారని, అందుకు అభివృద్ధిలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. తెలంగాణలో కుటుంబ పాలన, ఆ కుటుంబ అవినీతి పెరిగిపోతోందని అన్నారు. కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రారంభమైందని అన్నారు. అవినీతిని అణచివేస్తున్న తనపై పోరాడటానికి అన్ని శక్తులు ఏకమయ్యాయని చెప్పారు.
తెలంగాణలో కుటుంబ పాలనతో అవినీతిని పెంచి పోషిస్తున్నాని మండిపడ్డారు. అవినీతిపరులపై కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజాయతీగా పని చేసేవారు ఈ కుటుంబ పాలకులకు నచ్చడం లేదని విమర్శించారు. తెలంగాణలో ఉన్న కుటుంబ పాలన అన్ని వ్యవస్థలు తన గుప్పిట్లో ఉండాలని భావిస్తోందని మండిపడ్డారు. అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఎక్కడైతే కుటుంబ పాలన ఉంటుందో అక్కడ అవినీతి మొదలవుతుందని చెప్పారు. విచారణ సంస్థలను కూడా బెదిరించే స్థాయికి కుటుంబ పాలకులు వచ్చారని మండిపడ్డారు. కుటుంబ పాలనకు చరమగీతం పలుకుదామని పిలుపునిచ్చారు