భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో అడుగుపెట్టారు. రష్యా రాజధాని మాస్కో చేరుకున్నానని మోదీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేయడం కోసం, ముఖ్యంగా సహకార రంగంలో ఇరు దేశాల సంబంధాలను ఇంకా బలోపేతం చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ రష్యా పర్యటనలో భాగంగా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై లోతైన చర్చలు జరపనున్నారు.
భద్రత, ఇంధనం, పెట్టుబడులు, టూరిజం, విద్య తదితర రంగాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఐదేళ్ల అనంతరం ప్రధాని మోదీ రష్యాలో పర్యటిస్తుండడం ఇదే ప్రథమం. 2019లో రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సుకు మోదీ హాజరయ్యారు.