ఎంపీ : ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత జట్టు గెలవడంతో దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో జరిగిన వేడుకలు కాస్త శ్రుతి మించాయి. రాత్రిపూట రోడ్లపై టపాసులు కాలుస్తూ యువత కేరింతలు కొట్టారు. అదే సమయంలో అటుగా వచ్చిన పోలీస్ వాహనంపై రాళ్లు రువ్వారు. జనం ఎక్కువగా ఉండడంతో పోలీసులు వెళ్లిపోతుంటే వాహనాన్ని ఛేజ్ చేశారు. వెనుక పరిగెత్తుతూ రాళ్లు విసిరారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు.
పోలీస్ వాహనంపై దాడికి పాల్పడ్డ వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు యువకులపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ చట్టం కింద నిందితులను 12 నెలల వరకు నిర్బంధించే అధికారం పోలీసులకు ఉంటుంది. ఆపై అదుపులోకి తీసుకున్న యువకులకు గుండు కొట్టించి, వీధుల్లో ఊరేగించారు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
యువకులకు గుండు కొట్టించి ఊరేగించిన ఘటనపై బాధితుల తల్లిదండ్రులు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే గాయత్రి రాజెను ఆశ్రయించారు. భారత క్రికెట్ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న యువకులపై ఇలాంటి తీవ్రమైన కేసులు పెట్టడం, గుండు కొట్టించి ఊరేగించడాన్ని ఎమ్మెల్యే ఖండించారు. వాళ్లేమీ సాధారణ నేరస్థులు కారని గుర్తుచేశారు. వేడుకల్లో కొంత అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు, దానికి మందలించాలే కానీ ఇలా ఘోరంగా అవమానించడమేంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని స్థానిక పోలీస్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వివరించారు.