హైదరాబాద్ రింగ్ రోడ్డు సమీపంలోని 85 ఎకరాల భూమిని ఓ మంత్రి తన కుటుంబసభ్యుల పేరు మీద రాయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఈరోజు ఆయన నాంపల్లి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేతనైతే మూడు తరాలుగా అక్కడే ఉంటున్న గిరిజన రైతులకు పట్టాలు ఇప్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం మండలం, శంకర్‌పల్లి మండలం మధ్య చాలాకాలంగా భూవివాదం నడుస్తోందని శంకర్‌పల్లిలోని కొండకల్, రామచంద్రాపురంలోని వెలిమెల గ్రామాల మధ్య మిగిలిన దాదాపు రూ.1,500 కోట్ల విలువైన 85 ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రజలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజల భూములను కాపాడేందుకే ధరణి స్థానంలో భూమాత చట్టాన్ని తెచ్చామని అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చిన మంత్రి ఇప్పుడు పేద ప్రజల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తే పోలీసులను అడ్డు పెట్టుకొని బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఒక రంగు పోయి మూడు రంగుల జెండా వచ్చిందే తప్ప ప్రజల బతుకులు మారలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు కొంతమంది హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న పేదల ఖాళీ స్థలాలను, భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు.